కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌పై ఎక్కువ అంచనాలు వద్దనే సంకేతాల్ని నిన్న ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ద్వారా ఆమె ముందే వివరించారు. వృద్ధి రేటు లక్ష్యాన్ని 5 నుంచి 6 శాతానికే పరిమితం చేయడం ద్వారా... అనవసరమైన ఊహాగానాలు తన బడ్జెట్‌లో ఉండలని చెప్పినట్లైంది. అందువల్ల ఇవాళ్టి బడ్జెట్‌పై మరీ ఎక్కువ ఆశలు పెట్టుకుంటే నిరాశ తప్పదు. దేశ ప్రజలు మాత్రం ఈ బడ్జెట్‌పై ఎక్కువ అంచనాలే పెట్టుకున్నారు. కారణం దేశ పరిస్థితి మందగమనంలో ఉండటమే. ఈ మందగమనం నుంచీ దేశాన్ని బయటపడేసేలా బడ్జెట్ ఉండాలని అంతా కోరుకుంటున్నా... అంత సీన్ ఉంటుందా అన్నదే అనుమానంగా మారింది. గత NDA ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి ఇప్పటికీ ప్రభావం చూపిస్తున్నాయి. వాటివల్లే వివిధ రంగాలు దెబ్బతిన్నాయన్న విమర్శలున్నాయి. దానికి తోడు దేశంలో నిరుద్యోగం ఏమాత్రం తగ్గలేదు. నిత్యవసర ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఇక రైల్వే ప్రాజెక్టులపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ డిమాండ్లు ఉన్నా... నెరవేరుతున్నది చాలా చాలా తక్కువ.ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో అడ్డంగా పన్నులు బాదేస్తోందనే వాదన ఉంది. ఫలితంగా ప్రజలపై విపరీతమైన భారం పడుతోంది. పరిశ్రమల్లో ఉత్పత్తి వేగం తగ్గింది. ఆటోమొబైల్, భవన నిర్మాణ రంగాలు కోలుకోవట్లేదు. అందువల్ల పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుతోంది. వ్యవసాయం పరిస్థితీ అంతే. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6 వేలు ఇవ్వాల్సి వస్తోంది. అసలు రైతులు తమ దిగుబడులను చక్కగా అమ్ముకునే పరిస్థితే ఉంటే... కేంద్రం సాయం చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇటీవల ఉల్లి ధరలు విపరీతంగా పెరగడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన మార్కెటింగ్ సదుపాయాలు, సప్లై వంటివి చెయ్యలేకపోవడమే. అదే సమయంలో ఎంపీల పనితీరు అంతంత మాత్రంగా ఉంది. అభివృద్ధి ముందుకు సాగట్లేదు. పేదరికం ఏమాత్రం తగ్గట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ఏమాత్రం దేశాన్ని గట్టెక్కిస్తుందో చూడాలి.
ఇక ఇండియన్ రైల్వే విషయంలో : రైల్వే విషయంలోనూ బడ్జెట్‌లలో నిధులు బాగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఎన్నో అంచనాలు, ఆశలూ ఉన్నా... అవేవీ పట్టాలెక్కట్లేదు. ఇటీవల విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా... సరైన నిధులు లేకపోవడం సమస్యగా మారింది. ఇదే కాదు... ఎప్పుడో 2012లో ప్రకటించిన భద్రాచలం–కొవ్వూరు, కొండపల్లి–కొత్తగూడెం ప్రాజెక్టులే ఇంకా పూర్తి కాలేదు. ఇలా చాలా ప్రాజెక్టులు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. తిరుపతి, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, గుంతకల్ స్టేషన్లను అభివృద్ధి చేయాల్సి ఉన్నా... ఇప్పటికీ కేంద్రం తగిన నిధులు ఇవ్వలేదు. కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు పేపర్లకే పరిమితం అవుతున్నాయి. ఇక ప్రైవేట్ రైళ్లు, బుల్లెట్ రైళ్ల ఆశలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈసారి బడ్జెట్‌లో అలాంటివి ఏవీ లేవని తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండబోతోందని తెలిసింది.
ఆదాయపు పన్ను : గత బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపును రూ.5 లక్షల వార్షిక ఆదాయం వరకూ పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈసారి దాన్ని రూ.7 లక్షలకు పెంచుతుందనే అంచనాలున్నాయి. అదే జరిగితే మధ్య తరగతి ప్రజలు కొంత వరకూ ఆదాయాన్ని మిగుల్చుకోగలుగుతారు. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టేందుకు అవకాశాలు ఏర్పడతాయి.