ఆ దున్న పోతు రేటు 14 కోట్ల రూపాయలు

రాజస్థాన్‌: ఓ దున్నపోతు విలువ ఎంత ఉంటుంది? ఏముంది వేలల్లో.. మహా అయితే లక్షల్లో ఉంటుందేమో.. అనుకుంటున్నారా? మరి ఆ ధర వేలు, లక్షలు దాటేసి కోట్ల రూపాయలు పలికితే.. ఔను, మీరు విన్నది నిజమే... రాజస్థాన్‌లో ఓ దున్నపోతు విలువ అక్షరాల రూ.14 కోట్లు పలుకుతోంది. 1300 కిలోల బరువున్న ఈ దున్న.. రాజస్థాన్‌లోని నాగోరీ పశు మేళాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరి ఆ దున్నపోతు విశేషాలేంటో చూద్దామా...ఈ దున్నపోతు పోషణను అరవింద్‌ అనే వ్యక్తి చూస్తున్నాడు. దీనికి ముద్దుగా భీమ్‌ అని పేరు కూడా పెట్టాడు.ముర్రా జాతికి చెందిన భీమ్‌కు కండలు తిరిగిన దేహం ఉంది. అందుకే నాగౌరీలో ఇటీవల జరిగిన పశు మేళాలో భీమ్‌ తెగ సందడి చేసింది. ప్రస్తుతానికి భీమ్‌ విలువ మార్కెట్‌లో రూ.14 కోట్లు పలుకుతోందట. అయినప్పటికీ యజమాని అరవింద్‌ దీనిని వదులుకోవాలనుకోవటం లేదు. భీమ్‌ ఆరోగ్యం, అందమైన శరీరాకృతి కోసం.. ఒక్క రోజుకు సుమారు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నాడు. వైద్యులు సూచించిన ప్రకారం సోయాబీన్‌, శనగలు వంటి ధాన్యాలతో కూడిన ఆహారం తీసుకుంటూ ప్రొటీన్‌ డైట్‌ను ఫాలో అవుతుంది భీమ్‌! ఆపైన ఉదయాన్నే దీనికి నూనెలతో ప్రత్యేక మర్దన కూడా చేస్తారట.