చర్చిలో తొక్కిసలాట 20 మంది మృతి...

దారెస్సలామ్‌ : టాంజానియాలోని ఓ చర్చిలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతిచెందగా, మరో 16 మంది గాయపడ్డారు. టాంజానియాలో ప్రముఖ పాస్టర్‌ బోనిఫెస్‌ వాంపోసా ఆధ్వర్యంలో శనివారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. అందులో ఆయన ప్రార్థించిన నూనెను వేదిక ఎదుట పోశారు. భక్తులు ముందుకొచ్చి నూనెను తాకాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. అది తాకితే రోగాల నుంచి విముక్తి పొందుతామని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడం తొక్కిసలాటకు దారితీసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటనకు కారణమైన పాస్టర్‌తోపాటు మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.