కళింగ రాజ్యం నేటి ప్రత్యేక వార్త : నేడు అనేక రకరకాలైన ముద్రణలను అందంగా, వేగవంతంగా చదువగలుగుతున్నాము, ముద్రణ చేయగలుగుతున్నాము అంటే అది ఆయన వల్లనే అని చెప్పవచ్చు. ఆయనే సర్ ‘జోహన్ గ్యూటన్‌బర్గ్’ అనే అచ్చు యంత్ర సృష్టి కర్త. ఎన్ని మార్పులు జరిగినా అక్షర విప్లవాన్ని సృష్టించింది మాత్రం అచ్చు యంత్రమే అన్నది నిర్వివాదాంశం.
ఇందుకు మూల పురుషుడైన "జోహన్ గ్యూటన్‌బర్గ్" మహాశయుడు జర్మనీలో 1398 సంవత్సరంలో పిబ్రవరి ఈ రోజున అంటే 3వ తేదీన జన్మించాడు. అచ్చు యంత్రాన్ని కనుగొనడం జోహన్‌బర్గ్ మేధస్సులోంచి ఒక గమ్మత్తయిన సందర్భంలో నుండి పుట్టింది. కంసాలిగా శిక్షణ పొందిన గ్యూటన్‌బర్గ్ సొంత ఊరిలో ఉద్యోగం నిమిత్తం ఒక ధనాగారంలో పనిచేసేవాడు. అక్కడ అతని పని కరిగించిన లోహంతో నాణెలను తయారుచేయడం. ఇలా కరిగించిన లోహంతో ఒక లోహపు దిమ్మె మీద గానీ లేక వస్త్రం మీద గానీ ఇలా దేనిమీదైనా అద్దితే అది చదువుకోవటానికి వీలుగా ఉంటుందని గ్రహించాడు. ఆ విధంగా అనేకసార్లు ప్రయత్నం చేసి చేసి ప్రయోగాత్మకంగా 1448 వ సంవత్సరంలో ఈ అచ్చు యంత్రాన్ని సృష్టించి ప్రపంచానికి అందించాడు.దీని ఆసరాగా 1456వ సంవత్సరంలో బైబిల్ గ్రంథాన్ని అచ్చు పుస్తకంగా తీసుకురావటం ప్రపంచంలోనే సంచలనం కలిగించింది. ఆ తర్వాత వేగంగా ముద్రణా యంత్రాలు అనేక సరికొత్త మార్పులతో అన్ని దేశాలకు వ్యాప్తిచెందాయి. సాంకేతిక విప్లవాన్ని సృష్టించడమే కాక విజ్ఞానాన్ని వినువీధులకు ఎగరేసే ప్రయత్నాలు చేశాయి.
అప్పటికే చైనాలో అచ్చు యంత్రం కనిపెట్టబడిందన్న వాదనలు ఉన్నా "గ్యూటన్‌బర్గ్" కనిపెట్టిన అచ్చు యంత్రం మాత్రం శరవేగంతో అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు విస్తరించడం విశేషం.1702లో ‘డైలీ కోరంట్’ అనే వార్తాపత్రిక మొట్టమొదటిసారిగా ఇంగ్లండ్‌లో ప్రారంభమైంది. నేడు మనం చదువుకుంటున్న పుస్తకాలకీ, వార్తాపత్రికలకీ గ్యూటన్‌బర్గ్ అచ్చు యంత్రమే మూలమైంది అని చెప్పవచ్చు. 1468 వ సంవత్సరంలో అచ్చు యంత్ర సృష్టికర్త జోహన్ గ్యూటన్‌బర్గ్ మరణించాడు. ఆయనను మనం మర్చిన నాడు మన వృత్తి జర్నలిజానికే ద్రోహం చేసిన వారిమవుతాము. ఆయన జన్మదినం సందర్భంలో ఒక సారి ఆయనను గుర్తు చేసుకోవడం మన ధర్మమని ఆయన కోసం,అలాగే నేటి తరం పిల్లలకు,పాఠకులకు తెలిజేసేందుకు "కళింగ రాజ్యం" ప్రయత్నమే ఈ శీర్షిక. జోహార్ గ్యూటన్ బర్గ్ మీకివే మా జోహారులు.
పిబ్రవరి 3 ప్రత్యేకత !