మఖ్దూం మొహియుద్దీన్ ఓ కాకలుతీరిన కమ్యూనిస్టు యోధుడు. అంతే సమానంగా ఓ అద్భుతమైన కవి.అంతేకాదు తెలుగు రాష్ట్రాలలో ఆయన పేరు తెలియని కమ్యూనిస్టు నాయకులు ఉండరు.ఆయన పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు (సి.పి.ఐ) కార్యాలయం హిమాయిత్ నగర్(హైదరాబాదులో) ఉంది.ఆ కార్యాలయం నేడు తెలంగాణ రాష్ట్ర భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) గా కొనసాగుతూనే ఉంది. మఖ్దూంలో కమ్యూనిస్టు, మరియు కవి. రెండింటి మధ్య అవినాభావ, అవిభాజ్య సంబంధం ఉంది. ఆయన రాజకీయ కార్యకలాపాలను మాత్రమే శ్లాఘించేవారు, ఆయన కవిత్వం జోలికి పోకుండా ఉంటే కమ్యూనిస్టుగా మరిన్ని సేవలు అందించే వారని ఆనాటి వారు భావించేవారు. ఓ కవిగానే ఆయనను గుర్తించినవారు రాజకీయాలు లేకుంటే ఆయన మరింత గొప్ప కవిత్వం అందించేవారని కూడా అనుకునేవారు. కాని ఆయనలో కవి, కమ్యూనిస్టు సమపాల్లలో కలిగి ఒక్కరి గానే బ్రతికారు. ఒకరు లేకుండా మరొకరు లేరు.మఖ్దూం గురించి ఇప్పటివరకు వెలువడిన సాహిత్యంలో ఆయనలో ఏదో ఒక్క పార్శ్వాన్ని మాత్రమే అధికంగా చెప్పినవి ఎక్కువ. కాని మఖ్దూం జీవితాన్ని, కృషిని ఒక కవిగా,అత్యుత్తమ విలువలు గల కమ్యూనిస్టుగా సమపాళ్లలో నడిచింది అని చెప్పక తప్పదు.బతకడానికి పెయింటింగ్స్, సినిమా తారల ఫొటోలు అమ్మాడు. ట్యూషన్లు చెప్పాడు, పత్రికల్లో పనిచేశాడు. ఆయన రాసిన ‘గోథే ప్రేమ లేఖలు’ ‘మక్తబా’ అనే స్థానిక ఉర్దూ పత్రిక అచ్చేసింది.ఉస్మానియా యూనివర్సిటీలో మఖ్దూమ్ (1934-37) హాస్టల్‌లో ఉండేవాడు. అక్కడ తన తొలి కవిత ‘టూర్’ 1934లో రచించాడు. మఖ్దూమ్, కవి గా, నాటక రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడయ్యాడు. 1934లో బెర్నార్డ్ షా నాటకానికి ‘హోష్ కె నా ఖూన్’ అనే ఉర్దూ అనుసరణ రాసి హైద్రాబాద్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించాడు. గురుదేవులు ఆ నాటకం చూసి ఆనందం పట్టలేక, నాటక ప్రదర్శన అయిపోగానే స్టేజిపైకి వెళ్ళి మఖ్దూమ్‌ని అభినందించి, తన శాంతినికేతన్‌కు వచ్చి చదువుకోవాల్సిందిగా ఆహ్వానించాడు. మఖ్దూమ్ ‘మర్షదే కామిల్’ అనే మరో నాటకం రాశాడు. 1937లో మఖ్దూమ్ తన 29వ యేట ఎం.ఎ. డిగ్రీ తీసుకున్నాడు. ‘ఉర్దూ నాటకం’పై ఒక పరిశోధన పత్రం కూడా రాశాడు. హైకోర్టు పక్కన గల సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. కమ్యూనిస్టు రహస్య పత్రిక ‘నేషనల్ ఫ్రంట్’ సంపాదించి చదివేవాడు.నాగపూర్ కామ్రేడ్ల సహాయంతో 1930-40లలో హైద్రాబాద్‌లో ‘స్టూడెంట్స్ యూనియన్’ ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. చండ్ర రాజేశ్వరరావు, గులాం హైదర్, రాజ బహుదూర్ గౌర్, హమీదలీ ఖాద్రీ లాంటి నాయకులతో కలిసి పనిచేస్తుండేవాడు. ‘‘రైతుకు రొట్టె నివ్వని పొలమెందుకు, కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని!’’ అనే ఇక్బాల్ కవితను నినదించేవాడు. అక్తర్ హుస్సేన్ రాయ్‌పురి, సిబ్తె హసన్‌లతో కలిసి హైద్రాబాద్‌లో ‘అభ్యుదయ రచయితల సంఘం’ స్థాపించాడు. సరోజినీ నాయుడు నివాసమైన గోల్డెన్ త్రెషోల్డ్లో డాక్టర్ జయసూర్య, జె.వి.నరసింగరావులతో కలిసి సాహిత్య, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చలు జరుపుతుండేవాడు. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, అల్విన్, షాబాద్ సిమెంట్, ఎన్ ఎస్సార్ రైల్వే ఎంప్లాయిస్, ఎలక్ట్రిసిటీ, సి.డబ్ల్యు.డి. మున్సిపాలిటీ, బటన్ ఫ్యాక్టరీ వంటి వందల కంపెనీల్లోని కార్మిక సంఘాలకు మఖ్దూమ్ అధ్యక్షుడయ్యాడు. అహో రాత్రులు వారి సంక్షేమం కోసం కృషి చేశాడు. స్టేట్ అసెంబ్లీలో మాట్లాడినా, బయట కార్మిక సంఘాలలో మాట్లాడినా ఆయన వాగ్ధాటికి ఎదురుండేది కాదు. విషయం సూటిగా, స్పష్టంగా, దృఢంగా, బలంగా చెప్పేవాడు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో మెదక్ నుండి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయాడు. శాసనమండలికి ఎన్నికై 1969లో కన్నుమూసే దాకా కమ్యూనిస్టు నేతగా ఆ పదవిలోనే కొనసాగాడు. మఖ్దూం కార్మిక నాయకుడు, శాసన మండలి సభ్యుడు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకోసం క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు. అందరూ కలిసి భోజనం చేసే దస్తర్‌ఖాన్ల గురించి కల గన్నాడు. ప్రగతిశీల భావాలతో పీడితుల పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్నంకితం చేసి అమరుడైనాడు. కమ్యూనిస్టు అయిన మఖ్దూం. మతాన్ని ఎన్నడూ దూషించలేదు, అలాగని అనుసరించలేదు. హైద్రాబాద్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శిగా పనిచేశాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రధారిగా ఉన్నాడు. సాయుధ పోరాటానికి ముందు కారాగార శిక్షలు, పోరాటం తర్వాత అజ్ఞాత వాసం. హైద్రాబాద్ రాష్ట్ర శాసనసభ్యుడు (1952) శాసనమండలి సభ్యుడు, ప్రతిపక్ష నేత (1956-1969), భారత కార్మిక వర్గ విప్లవ చరివూతలో ముఖ్య పాత్రధారి. ఎఐటియుసికి జాయింట్ సెక్రటరీ. ఢిల్లీలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ సమాఖ్య (ఎ.ఐ.టి.యు.సి.) జాయింట్ సెక్రటరీగా కొంత కాలం ఢిల్లీలో ఉన్నాడు.1952-55 మధ్య చైనా, సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు తిరిగి వచ్చాడు. ప్రపంచ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ప్రధాన కార్యాలయం వియాన్నాలో (1953-54) పనిచేశాడు.ప్రముఖ కవియేగాక నాటక కర్త, గాయకుడు మరియు నటుడు కూడా. ఇతని గజల్ లు, పాఠ్యకాంశాలలోను, సినిమాలలోనూ ఉపయోగించాడు.ఆయన రాసిన ‘ఏ జంగ్ హై జంగే ఆజాదీ’ ‘ఎక్ చంబేలీకె మండ్వే తలే’ అనే గీతాలు ప్రసిద్ధి పొందాయి.ఉర్దూ మహాకవిగా ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు.
'ఫిర్ ఛిడీ బాత్, బాత్ ఫూలోం కి' అను గజల్ (గేయం) సుప్రసిధ్ధి.
1944లో సుర్ఖ్ సవేరా (అరుణోదయం),
1961లో గుల్ ఎ తర్ (తాబీపూవు),
1966లో బిసాతే రక్స్ (నాట్య వేదిక) పేర మూడు కవితా సంపుటాలను రచించాడు.
1944-51 మధ్యకాలంలో 'తెలంగాణ' అనే కవిత రాశాడు.1969, ఆగష్టు 25 తేదీన గుండెపోటుతో ఢిల్లీలో చనిపోయాడు.జోహార్ కామ్రేడా ఇవే మా జోహారులు.అమర్ రహే మఖ్దుం అమర్ రహే.......
మఖ్దుం మొహియుద్దీన్ జయంతి సందర్భంలో పాఠకులకోసం ఆయన గురించి నాకు తెలిసిన నాలుగు ముక్కలు...