భార్య తలనరికి పట్టుకొని పోలీసు స్టేషన్ లో లొంగిపోయిన భర్త ;

లఖ్‌నవూ: యూపీలోని బారబంకిలో శనివారం ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య తల నరికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఎస్పీ అరవింద్‌ చతుర్వేది తెలిపిన వివరాల ప్రకారం.. అఖిలేష్‌ రావత్‌ జహంగిరాబాద్‌ పీఎస్‌ పరిధిలోని బహదుర్‌పూర్‌ గ్రామంలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. శనివారం భార్య భర్తల మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారితీసింది. దీంతో అతను తన భార్యను చంపి దేహం నుంచి తల వేరు చేశాడు. అనంతరం తలను చేతిలో పట్టుకొని పోలీసుస్టేషన్‌కు బయలుదేరాడు. ఈక్రమంలో రహదారిలో పోలీసులు గమనించి అఖిలేష్‌ను ఆపి తలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా చిన్నపాటి గొడవ జరిగింది.అనంతరం అతను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ పోలీసులు అతడి నుంచి తలను స్వాధీనం చేసుకోగానే వెంటనే జాతీయ గీతాన్ని ఆలపించడం మొదలు పెట్టాడు. ఇంట్లో వారిద్దరి మధ్య చోటుచేసుకున్న తగాదే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు.