దేశంలో మరొక కరోనా కేసు ....

తిరువనంతపుం: కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కేరళలో మరో వ్యక్తికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం అతని ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతను ఇటీవల చైనాలో పర్యటించి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా కేసుతో ఇప్పటి వరకు భారత్‌లో రెండు కరోనా కేసులు నమోదు కాగా రెండూ కూడా కేరళలోనే కావడం ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు కరోనా వైరస్‌ ప్రభావం వల్ల చైనా వెలుపల ఫిలిప్పీన్స్‌లో తొలి మరణం నమోదైంది. మరణించిన వ్యక్తి వుహాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. చైనాలో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా వుహాన్‌ సిటీకి ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానాన్ని పంపి.. మొదటి విడతలో 324 మందిని ఢిల్లీకి తీసుకువచ్చారు. వచ్చిన వారిలో ఏపీకి చెందిన 56 మంది ఇంజనీర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. కాగా రెండో విడతలో 323 మంది ఆదివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున వుహాన్‌ నుంచి బయలుదేరిన రెండవ బృందం ఎయిర్‌ ఇండియా విమానంలో ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు చైనాలో మరణించిన వారి సంఖ్య 304కు పెరిగింది. అంతేకాదు చైనా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదయితే.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14,380 కు పెరిగింది. కేసుల్లో ఎక్కువ భాగం చైనాలో నమోదయ్యాయి. మరో 23 దేశాలలో సుమారు 100 కేసులు నిర్ధారణ అయ్యాయి.