గుంటూరు - నల్గొండ జిల్లాల వాసుల పాతికేళ్ల కల నెరవేరనుంది.

బీబీనగర్‌- గుంటూరు రైలు మార్గాన్ని డబ్లింగ్‌ (రెండో లైను) చేయాలనే ప్రతిపాదనలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రైలు మార్గాన్ని డబుల్‌ లైనుగా మార్చేందుకు తుది సర్వే చేయాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకు రైల్వేబోర్డు డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ రాజేష్‌ సెహ్రా రూ.3.10 కోట్లు కేటాయిస్తూ గత నెల 16న ఆదేశాలు జారీచేశారు. బీబీనగర్‌ నుంచి గుంటూరు వరకు 248 కిలోమీటర్ల మేరకు ఉన్న ఈ రైల్వే లైనును బీబీనగర్‌ నుంచి నల్లపాడు జంక్షన్‌ వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో ఓసారి సమగ్ర సర్వే చేపట్టారు. ఆ సమయంలో కేవలం రైల్వే లైను మాత్రమే ఉండగా ప్రస్తుతం విద్యుత్తు లైను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు తుది విడత సర్వే చేసి (ఫైనల్‌ లొకేషన్‌ సర్వే) నివేదిక సమర్పించేందుకు నిధులు కేటాయించారు. సర్వే నివేదిక తరువాత అవసరమైన నిధులు వచ్చే సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించే అవకాశం ఉంది.


ప్ర స్తుతం మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ నుంచి నెలకు సగటున 50 వేల మంది వరకు ప్రయాణికులు వెళ్తున్నారు. నిత్యం 1500 మందికి పైగా ఆయా ప్రాంతాలకు రైళ్లను వినియోగిస్తున్నారు. డబ్లింగ్‌ చేసి లైను ఏర్పాటు చేస్తే ప్రయాణ సమయం తగ్గుతున్నందున మరింత ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉంది. అదనంగా రైళ్లు సమయాలకు అనుగుణంగా నడిపించవచ్ఛు


సరిపడా రైళ్ల రాకపోకలు లేక ఆగిన డబ్లింగ్‌


ఈ మార్గాన్ని రెండు లైన్లుగా ఏర్పాటు చేయాలని అనేక ఏళ్లుగా గుంటూరు, నల్గొండ జిల్లా వాసులు కోరుతున్నారు. ఆరేళ్ల క్రితం అప్పటి రైల్వే జీఎం మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన సందర్భంగా నాటి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ మార్గాన్ని రెండు లైన్లుగా ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఒక రోజులో కనీసం 25 రైళ్లు ప్రయాణించే మార్గాల్లోనే డబ్లింగ్‌కు ప్రతిపాదిస్తామని జీఎం తేల్చిచెప్పారు. అప్పట్లో కేవలం 21 రైళ్లు మాత్రమే ఈమార్గంలో ప్రయాణించేవి. రెండేళ్లుగా ఈమార్గంలో సుమారు 30కి పైగా రైళ్లు వెళ్తుండగా రెండు లైన్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.


డబుల్‌ లైన్లతో కలిగే ప్రయోజనాలు 1.మిర్యాలగూడ నుంచి సికిందరాబాద్‌కు ప్రస్తుతం 3.15 గంటల సమయం (క్రాసింగ్‌ల వల్ల) పడుతోంది. రెండులైన్లు ఏర్పాటు చేస్తే 2.10 గంటల్లోనే చేరుకోవచ్ఛు 2.మిర్యాలగూడ నుంచి గుంటూరుకు 3.10 గంటల సమయం పడుతుంది. రెండు లైన్ల ఏర్పాటుతో 2.30 గంటల్లోపు గుంటూరు చేరుకోవచ్ఛు. 3.సరకు రవాణా చేసే రైళ్లు సకాలంలో చేరుకునే అవకాశం ఉంది.4.భారత ఆహార సంస్థ నుంచి బియ్యం రవాణా చేసే గూడ్స్‌ రైళ్లు ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది. 5.గుంటూరు- సికింద్రాబాద్‌ మార్గంలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అవకాశం ఉంది.