గూడ్సు రైళ్లలో ఇకపై ఎస్కార్టులు..

దిల్లీ: గూడ్సు రైళ్లలో మార్గమధ్యంలో సరకు దొంగతనాలు పెచ్చుమీరుతున్న వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చోరీలను నివారించేందుకు గూడ్సు రైళ్లలో ఇకపై ప్రైవేటు ఏజెన్సీలకు చెందిన సాయుధులైన రక్షకుల (ఎస్కార్టులు)ను నియమించుకోనుంది. తొలి విడతగా తూర్పు రైల్వే జోన్‌లో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ఆరు నెలల తర్వాత దీనిపై సమీక్షించి, ఇతర రైల్వే జోన్లలో ప్రవేశ పెట్టాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఈ నెల 29 ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సరకులతో వెళుతున్న గూడ్సు రైళ్లలో చోరీలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది.