కాకినాడ :కాకినాడ పోర్టు- తిరుపతి మధ్య నడిచే 57257, 57258 పాసింజరు రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారాయి. కాకినాడ పోర్టు- రేణిగుంట మధ్య మాత్రమే ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీీసర్ సీహెచ్ రాకేష్ అన్ని రైల్వేస్టేషన్లకు సమచారం పంపారు. వేళల్లోనూ మార్పు చేసినట్లు పేర్కొన్నారు. 17250 నెంబరుగా కాకినాడ పోర్టు నుంచి మధ్యాహ్నం 13.45 గంటలకు బయలుదేరిన ఈ ఎక్స్‌ప్రెస్ రైలు కావలికి 22.29 గంటలకు చేరుకుంటుంది. బిట్రగుంటకు 22.43, నెల్లూరుకు 23.28 గంటలకు, రేణిగుంటకు తెల్లవారుజామున 3.45 గంటలకు చేరుకుంటుంది. 17249 నెంబరు గల రైలు రేణిగుంటలో రాత్రి 22.20 గంటలకు బయలుదేరుతుంది. గూడూరుకు అర్ధరాత్రి 12.05, నెల్లూరుకు 12.40, బిట్రగుంట 1.10, కావలికి 1.30 గంటలకు, కాకినాడు పోర్టు స్టేషన్‌కు మధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుంటుంది. కాకినాడ పోర్టు- తిరుపతి మధ్య నడిచే పాసింజర్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చిన సమాచారంపై సరైన ప్రచారం లేకపోవడంతో ప్రయాణికులు అయోమయంలో పడ్డారు.ఫిబ్రవరి 1 నుంచే అమల్లో ఉందని ముందస్తుగా సమాచారం ఉన్నా కీలకమైన రైల్వేస్టేషన్లలో రైళ్ల రాకపోకల పట్టికలో పాత సమాచారమే ఉండటం గమనార్హం. సంబంధిత రైల్వే అధికారులు స్పందించి తాజా సమాచారాన్ని పట్టికలో పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లను తిరుపతి వరకు పొడిగించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఎక్స్ ప్రెస్ గా మారిన పాసింజరు : సమాచారం లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణీకులు.