ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల సంఖ్యను మరింత పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్‌ను చూసిన తర్వాత జిల్లాల సంఖ్య 25 కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020 - 21 సంవత్సరంలో వైద్యుల సంఖ్య పెంచేందుకు ఓ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ప్రతి జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా ఓ మెడికల్ కాలేజీని నిర్మించాలని ప్రతిపాదించారు. అది పీపీపీ పద్ధతిలో నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు భూమిని కేటాయిస్తే ఆ స్థలంలో పీపీపీ పద్ధతిలో నిర్మిస్తారు. దీని వల్ల ప్రతి సంవత్సరం కొత్తగా ఎక్కువ మందికి మెడిసిన్‌లో సీటు వస్తుంది. ఒక్కో ఆస్పత్రికి ప్రాథమికంగా 50 సీట్లు కేటాయించినా, ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని మెడికల్ సీట్లు పెరుగుతాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు మరిన్ని ఎక్కువ మెడికల్ సీట్లు దక్కించుకోవాలంటే జిల్లాల సంఖ్యను పెంచుకోవడం ఉత్తమం. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. 10 జిల్లాలను 33 జిల్లాలు చేశారు. ఈ ప్రాతిపదికన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ను ఇంకా ఎక్కువ జిల్లాలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే, జిల్లాలు కావాలని చాలా కాలంగా డిమాండ్లు చేస్తున్న వారి కోరికలు కూడా నెరవేర్చినట్టు అవుతుంది. ఏపీలో కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించడానికి అసలు కారణమే మెడికల్ కాలేజీల ఏర్పాటు. ఆ మూడు జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజీలు రావాలంటే మరిన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
ఆంధ్రప్రదేశ్లో క్రొత్త జిల్లాల ఏర్పాటు .