బుర్రకథా పితామహుడు ప్రజాకళాకారుడు షేక్ నాజర్ జయంతి సందర్భంగా ....

షేక్ నాజర్.. ప్రముఖ జానపద కళ బుర్రకథా పితామహుడు. ప్రతి పల్లెకు పరిచయమున్న కళ ఇది. నాటి నుండి నేటి వరకూ పల్లెలో ఆదరణ పొందిన ఈ జానపద ప్రక్రియ ఆయన ఆలోచన నుంచి వెలువడినదే. తుంబుర,డక్కీల సహాయంతో కధకుడు కధను తుంబుర శృతి ఆధారంగా గానం చేయగా ఇరువైపులా ఇద్దరు డక్కీలను కొడుతూ కధకుడు పాడిన పాటకు వంతలు కలుపుతూ,ఒకరు పండితరంజంగా వేరొకడు పామర రంజకంగా ఆయనకు సహకరిస్తూ చెప్పిన కధే "బుర్రకథ" అని ఆయన ఈ కళను ప్రజలకు పరిచయం చేశాడు.ఈ వంతలు పాడే వ్యక్తులకు కూడా కధకుడు పాట రూపంలో కధను గానం చేయగా ఒకరు వచనంలో ప్రజలకు అర్ధమయ్యే విధంగా చెపుతారు.మిగితా మూడవ వ్యక్తి పామరులకు అర్ధమయ్యే విధంగా ప్రశ్నలు వేసి అందరికీ అర్థం అయ్యే విధంగా విడమర్చి చెప్పించేవాడు. కధను వచన రూపంలో చెప్పేవాడిని వచనం గానూ, విడమర్చి ప్రశ్నలు అడిగే వాడిని హాస్యం గానూ నామకరణం చేశారు. ఆవిధంగా మొదలైన బుర్రకథ అనేక క్రొత్త పోకడల నడుమ నాటినుండి నేటివరకు  ప్రజల మన్ననలు పొందుతుంది. అటువంటి బుర్రకథా పితామహుడు మన "నాజర్". ఆయన గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకులముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 5వ తేదీన షేక్‌ మస్తాన్‌, బీబాబీల దంపతులకు జన్మించారు. నాజరు పూర్తి పేరు "షేక్ నాజరు వలి". ఆయన కృష్ణలీలలో దేవకి, శ్రీ కృష్ణ తులాభారంలో "రుక్మిణి", భక్త రామదాసులో "ఛాందిని" వంటి ఆడవేషాలు వేసి ప్రజలను మెప్పించారు. పాఠశాల స్థాయిలో "ద్రోణ" పాత్రకు జీవం పోశారని ప్రముఖ హార్మోనిస్టు ఖాదర్ ప్రశంసించారు. ఖాదర్ ఆయనను "మురుగుళ్ళ" వద్ద సంగీతం నేర్చుకోవాలని అప్పగించారు. పేదరికం వల్ల అచట ఉండలేకపోయారు. ఆ తరువాత ఆయన బాల మహ్మదీయ సభ పేరిట మళ్ళీ నాటకాలాడి మంచిపేరు గడించారు.వృత్తి రీత్యా దర్జీగా మారారు. ఆర్యమత సిద్ధాంతం నచ్చి మాంసాహారం మానేశారు. పాదుకా పట్టాభిషేకంలో "కైకేయి", ఖిల్జీ రాజ్యపతనంలో "కమలారాణి" పాత్రలు పోషించారు. నాస్తికుడయ్యారు. కొమ్మినేని బసవయ్య గారి పిల్లలకు సంగీతం నేర్పటం, నాటకాలు ఆడించడం ద్వారా సంగీతం గురువయ్యారు. కొండపనేని బలరామ్‌, వేములపల్లి శ్రీకృష్ణ గుంటూరు తీసుకువచ్చి బుర్రకథ నేర్చుకుంటే ప్రచారానికి బావుంటుందని నిర్ణయించారు. వేపూరి రామకోటి కథకుడు, నాజర్‌ హాస్యం, ముక్కామల పురుషోత్తం రాజకీయ వంతలుగా దళం ఏర్పర్చారు.జానపద కళారూపమైన  బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్.ఆయన నటుడు, ప్రజారచయిత, గాయకుడు. "ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు.తెనాలిలోని  బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది. కమ్యూనిస్టు పార్టీలోచేరి ప్రజానాట్యమండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను కార్యక్రమాలను బుర్రకథల ద్వారా ప్రచారం చేశాడు. వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు,  బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు,భక్త ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు మొదలగు ఇతివృతాలలో నమకాలీన రాజకీయాలను జోడించి బుర్రకథలు రూపొందించాడు. బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన పింజారీ అనే పుస్తకంగా ప్రచురించాడు. పుట్టిల్లు, అగ్గిరాముడు, చిత్రాలలో బుర్రకథలు చెప్పాడు. నిలువుదోపిడి, పెత్తందార్లు చిత్రాలకు పనిచేసాడు.ఆయన కొంతకాలం విరసం సభ్యుడు.ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్‌ నాజర్‌. , అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే - సినిమాల్లో నాజర్‌ బుర్రకథలు కన్పిస్తాయి. పూలరంగడు సినిమాలో అక్కినేనికి నేర్పించారు. చాలా మందికి ఈ గాంధర్వ విద్య నేర్పాడు. ఆయన గళ గాంభీర్యాన్ని, మాధుర్యాన్ని గమనించి, వివశులైన సినీ సంగీత దర్శకులు ఎస్‌. రాజేశ్వరరావు సినీరంగంలో స్థిరపడమని కోరినా, ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు. ఆసామీ నాటకాన్ని రచించాడు. 18వ ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో ఆసామి నాటకం ప్రథమ బహుమతి పొందింది. నాజర్‌ ఏడుసార్లు జైలు జీవితాన్ని అనుభవించాడట.రంగస్థల మహానటుడు  బళ్లారి రాఘవాచార్యులు నాజరు బుర్రకథ విని అమితానందంతో బళ్లారికి ఆహ్వానించడం, మద్రాసులో ప్రదర్శన చూచిన డా: గోవిందరాజుల సుబ్బారావు నాజరుని అభినందిస్తూ కౌగిలించుకోవడం, ప్రముఖ పాత్రికేయుడు కె. అబ్బాస్ నాజరును ఆంధ్ర అమరషేక్ అని అభివర్ణించడం, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నాజరు ప్రజాభాషకు ముగ్ధుడై 'నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడో' అని ఆలింగనం చేసుకోవడం, నాజరు సాధించిన కళాప్రతిభకు తిరుగులేని నిదర్శనాలు. మరణించేవరకు కటిక పేదరికాన్ని అనుభవించాడు. ఆంధ్రనాటక అకాడమీ 1981లో ఉత్తమ కళాకారుడు అవార్డుతో సత్కరించింది.1986వ సంవత్సరంలో  భారతప్రభుత్వం  "పద్మశ్రీ" బిరుదుతో నాజరును సత్కరించింది. ఆయన చివరి దశ వరకూ ప్రజానాట్యమండలి ఆశయాలు ప్రజలకు వివరించి అభివృద్ధికి తోడ్పడ్డాడని చెప్పవచ్చు. అలా సాగిన ఆయన జీవితం 1997వ సంవత్సరం  ఫిబ్రవరి 22 తేదీన అంగలూరులో మరణించారు.