చైనా వూహాన్‌లో చిక్కుకున్న ఏపీ యువతి.కరోనా వైరస్ కారణమా??

చైనా వూహాన్‌ను కరోనా వైరస్ వణికిస్తుంది. దీంతో WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇటు మన భారతదేశంలో కూడా ఇప్పటికే కరోనా వైరస్‌కు సంబంధించి రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చైనాలో అయితే ఈ వైరస్ బారిన బడి వందలాదిమంది చనిపోయారు. ఈ నేపథ్యంలో టీసీఎల్ ఉద్యోగ శిక్షణ కోసం చైనాకు వెళ్లి అక్కడ చాలామంది చిక్కుకుపోయారు. అందులో తెలుగు వారు కూడా ఉన్నారు. దీంతో దేశ ప్రభుత్వం వూహాన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు రెండు ప్రత్యేక విమానాల్ని పంపింది. అక్కడున్న వారిని ఇక్కడకు తీసుకొచ్చి నేపాల్ సరిహద్దుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి అందులో ఉంచింది. వారికి పరీక్షలు చేసి కరోన్ వైరస్ ఉందా లేదా అన్న పరీక్షలు నిర్వహిస్తున్నారు.అయితే ఏపీకి చెందిన ఓ యువతి తాను వూహాన్‌లో చిక్కుకుపోయానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఓ వీడియో కలకలం రేపుతుంది. కర్నూలు ఈర్ణపాడుకు చెందిన బాధిత యువతి శృతి టీసీఎల్ ఉద్యోగ శిక్షణ కోసం చైనా వూహాన్‌కు వెళ్లింది. అయితే అక్కడనుంచి వచ్చే సమయంలో ఆమెకు తీవ్ర జ్వరం ఉందంటూ... ఆమెతో పాటు మరో ఉద్యోగిని కూడా అధికారులు అడ్డుకున్నారు. ఫ్లైట్ ఎక్కించేందుకు నిరాకరించారు. దీంతో ఆ ఇద్దరు చైనాలో ఇరుక్కుపోయారు.దీంతో బాధితురాలు వీడియో ద్వారా తన తల్లికి మెసేజ్ పంపింది. తనకు జ్వరం ఉన్న మాట వాస్తవమేనని.. అయితే ఇప్పుడు తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది. పనులు చేయడం వల్లే అలసటతో జ్వరం వచ్చిందని... అంతే తప్పా తనకు ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని తెలిపింది. దీంతో శృతి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శృతికి ఇటీవలే నిశ్చితార్థం కూడా అయ్యింది. ఈనెల 17న వివాహం జరిపేందుకు కూడా పెద్దలు నిశ్చయించారు. దీంతో ఇప్పుడు తమ కూతురు ఆ దేశంలో చిక్కుకుపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన బిడ్డను స్వస్థలానికి తీసుకురావాలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.