శ్రీకాకుళం : "రుక్మిణీదేవి అరండేల్ " ఫిబ్రవరి 29వ తేదీన, 1904 వ సంవత్సరం జన్మించింది.ఈమె తమిళనాడులోని చెన్నైలో కళాక్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు.ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, భరతనాట్యాలలో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేసింది.ఈమె నీలకంఠశాస్త్రి, శేషమ్మ దంపతులకు తమిళనాడులో గల మదురైలో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే దివ్యజ్ఞాన సమాజంలో చేరింది.ఈమె తన అభిరుచులతో, ఆలోచనలతో ఏకీభవించిన జి.ఎస్.అరండేల్ అనే విదేశీయుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు, అరండేల్ కు 40 సంవత్సరాలు. వీరి వివాహము పెద్దల విపరీతమైన అభ్యంతరాల మధ్య ముంబైలో రిజిస్టర్ ఆఫీసులో జరిగింది.
వివాహానంతరం ఈమె తన భర్తతో అనేక ప్రదేశాలను దర్శించే అవకాశం లభించింది. ఆమె తనకు సహజంగానే కళలయందున్న ఆసక్తిచేత అన్నాబావ్లే అనే రష్యా కళాకారిణి చేసిన బాలే నృత్యము పట్ల ఆకర్షితురాలై, ఆమె సహాయంతోనే ఆమె గురువైన కిళియోనర్టిని గురువుగా స్వీకరించి బాలే నృత్యాన్ని అభ్యసించింది. ఆపై అన్నాబావ్లే సలహా ననుసరించి తన భరతనాట్య శిక్షణకు కావసిన ప్రయత్నాలు ప్రారంభించింది. కాని ప్రారంభంలో అనేక తిరస్కారాలను చవిచూసింది. ఆ రోజులలో స్త్రీలు నాట్యాన్ని అభ్యసించడం అవమానంగా భావించడం చేత ఆరంభంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నా, ఆమె తన పట్టు విడవకుండా మీనాక్షి సుందరం పిళ్ళై దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది.ఐర్లాండ్ కవి జేమ్స్ ఆమె యొక్క ప్రతిభను పది మందికి పంచి పెట్ట మని, అందుకు తగిన విధంగా నాట్య పాఠశాల ఆరంభించాలని కోరిక వెలిబుచ్చాడు. కవి జేమ్స్ కోరిక ఆమెను నాట్య పాఠశాల ఆరంభించేలా ఉత్తేజ పరచింది. ఈ నాట్య పాఠశాల "ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్" అనే పేరుతో అనేక మంది ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. తరువాత కాలంలో అదే కళాక్షేత్రంగా రూపుదిద్దుకుంది.నాట్య పాఠశాలకు ఆమె మొదటి గురువైన సుందరం పిళ్ళై, అతని అల్లుడు చొక్కలింగం పిళ్ళై ఉపాధ్యాయులుగా నియమించింది. మొదటి విద్యార్థుల సంఖ్య కేవలం నలుగురే. ఈ పాఠశాలలో నాట్యమే కాక సంగీతమూ నేర్పుతారు. అందమైన తోటలు, తామర కొలనులు, సంప్రదాయమైన కట్టడాలు ఈ పాఠశాలను నాట్య దేవాలయంగా చేశాయి. అడుగడుగునా ఆమె కృషి, అభిరుచి ప్రతిబింబిస్తూ ఈ పాఠశాల నాట్య రంగానికి ఎనలేని కృషి చేస్తూ అభివృద్ధికి వచ్చింది. ఈ పాఠశాలకు ఆమె చేసిన సేవ ఆమెను చిరకాలం గుర్తుంచుకునేలా చేసింది.1952 ఏప్రిల్‌లో రుక్మిణీదేవి రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఈమె రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది. జంతు సంక్షేమం కోసం పాటుపడిన రుక్మిణీదేవి రాజ్యసభలో ఉన్న సమయంలో జంతువులపై కౄరత్వ నిరోధ బిల్లు (1960) తీసుకురావటంలోను, జంతు సంక్షేమ బోర్డు స్థాపనలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడుతూ ఈమె చేసిన ప్రసంగం సభను కదిలించింది. ఆ ప్రసంగం విని చలించిన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఆమె అభిప్రాయాలతో ఏకీభవించి, 'ఈ విషయమై ప్రభుత్వమే ఒక పరిపూర్ణ చట్టం చేస్తుందని హామీ ఇచ్చి, ఆమె ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోమ'ని కోరాడు. రుక్మిణీదేవి తీసుకున్న ఈ చొరవే, ఆ తరువాత ప్రభుత్వం నిరోధ చట్టం చేయటానికి దారితీసింది. రుక్మిణీదేవి జంతు సంక్షేమం కొరకై అనేక జీవకారుణ్య మరియు మానవతావాద సంస్థలతో పనిచేసింది.రుక్మిణీదేవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం "పద్మభూషణ్" తోను, శాంతినికేతన్ "దేశికోత్తమ" బిరుదుతోను ఆమెను సత్కరించాయి. భరతనాట్యానికి గుర్తింపు, గౌరవాన్ని కలిగించి, దానిలోని దైవిక తత్వాన్ని ప్రపంచానికి చాటిన ఘనతలో రుక్మిణీదేవి అరండేల్ కు ప్రధాన పాత్ర ఉంది.ఆమె స్థాపించిన కళాక్షేత్ర విద్యార్థులు అనేకమంది నేడు వివిధ రంగాలలో ప్రకాశిస్తున్నారు.1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నపుడు, రుక్మిణీదేవిని భారత రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి పరిశీలించాడు. అయితే ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో అది ముందుకు సాగలేదట.అటువంటి నాట్యమయూరి ఫిబ్రవరి 24వ తేదీన 1986సంవత్సరంలో తన ప్రయాణం చాలించి మనందరిని విడిచి మరణించింది.అటువంటి భరత నాట్య ఆరాధ్యురాలు జన్మించిన ఈ ప్రత్యేక దినాన్ని పురష్కరించుకొని ఆమెను ప్రతి కళాకారులు జ్ఞాపకం చేసుకోవాలి అని చేసిన నా ప్రయత్నమే ఇది.
నాట్య కళాకారిని పద్మభూషన్ "రుక్మిణీదేవి అరండేల్ "జయంతి సందర్భంలో . ఈతరం కళాకారులకు గుర్తు చేసే ప్రయత్నం ...