భీమిలి : మన రాష్ట్రంలో తీరం వెంబడి ఎన్ని బీచ్‌లు ఉన్నా విశాఖలోని భీమిలి బీచ్ ప్రత్యేకతే వేరు. వాహనాల రణగొణ ధ్వనులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నంత సేపు ప్రకృతి ఒడిలో సేదతీరినట్టుగానే అనిపిస్తుంది. అనుకోకుండా వెళ్లినా, మరచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చిన భీమిలి 'జర్నీ' విషయాలు మీ కోసం!
ఓ కార్యక్రమం నిమిత్తం విశాఖపట్నం జిల్లా తగరపువలసకు వెళ్లాం. కార్యక్రమం ముగిసి, భోజనం చేసి మేడపైకి వెళ్తే కనుచూపు మేరలోనే సాగరతీరం దర్శనమిచ్చింది. అదే భీమునిపట్నం (భీమిలి) సముద్రతీరం. విశాఖపట్నం జిల్లా తగరపువలసకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. తక్కువ దూరం కావడంతో ముందుగా ఎటువంటి ప్రణాళికా లేకుండానే అప్పటికప్పుడు వెంటనే కారు తీసుకుని, ప్రయాణమయ్యాం.తగరపువలస దాటగానే ప్రకృతి సోయగాలు మాకు స్వాగతం పలికాయి. అలా ముందు సాగగానే రోడ్డుకి ఓవైపు చెట్లతో నిండి, మరోవైపు సముద్రతీరం కన్నులను కట్టిపడేశాయి. ఎప్పుడెప్పుడు దిగి ప్రకృతిలో మమేకమైపోదామా అన్న ఉత్సాహం నెలకొంది. నిమిషాల్లోనే భీమిలి సముద్రతీరం మాకు స్వాగతం పలికింది. సముద్ర తీరంలో అలల తాకిడికి సహజసిద్ధంగా వివిధ ఆకారాలుగా ఏర్పడిన నల్లటి శిలలు చూడగానే ఆకట్టుకున్నాయి. వాటి మీదకు ఎగసిపడే అలల చప్పుడు హృదయాన్ని హత్తుకున్న అనుభూతి కలిగింది. పాత సినిమాల్లో వచ్చే నేపథ్య సంగీతంలా వినిపించే సముద్రపు అలల శబ్ధం, తీరం వెంబడి వీచే చల్లని గాలి మమ్మల్ని మేం మైమరచిపోయేలా చేశాయి. మానసిక ప్రశాంతతను చేరువ చేశాయి.
సహజంగా ఏర్పడిన ఆక్వేరియాలు..!
సముద్రపు ఒడ్డున ఉన్న రాళ్ల మధ్యన సహజసిద్ధంగా ఏర్పడిన గుంతలు దర్శనమిచ్చాయి. సాగరం ముందుకొచ్చి, ఆ గుంతలను నీటితో నింపడం వల్ల అవి ఖాళీగా ఉండవు. ఆ చిన్నపాటి గుంతల్లో చిన్న చిన్న చేపలు, పీతలు తిరుగుతూ కనువిందు చేస్తుంటే, గుంతల్లోని రంగురంగుల రాళ్లు ఎంతగానో ఆకర్షించాయి. అలా ప్రకృతి ఒడిలో సహజంగా ఏర్పడిన ఆక్వేరియాల ముందు పెద్ద పెద్ద హోటళ్లలో లక్షలు ఖర్చు పెట్టి, ఏర్పాటు చేసిన ఆక్వేరియాలూ తక్కువే అనిపిస్తుంది. సాగరతీరంలో ఏర్పాటు చేసిన కళాఖండాలు ఆకట్టుకుంటాయి. సాగరతీరం మధ్యలో సాగర కన్య ఒడ్డున కూర్చున్నట్లు కనిపించే శిల్పం అచ్చం సాగరకన్యే ఒడ్డుకు వచ్చినట్లుగా కనిపించింది. అలా ముందుకు వెళ్తే మత్స్యకారుడు తన రెండు చేతుల్లో చేపలు పట్టుకున్నట్లు ఉండే ఓ నిలువెత్తు విగ్రహం దర్శనిమిచ్చింది. డాల్ఫిన్లు సమూహంగా తిరుగుతున్నట్లు ఉండే స్థూపమూ కనువిందు చేస్తుంది. బౌద్ధ గురువులు ధ్యానం చేస్తున్నట్లు ఉండే విగ్రహాలూ చూడముచ్చటగా ఉన్నాయి. అన్ని శిల్పాల వద్ద ఫొటోలు తీసుకుని, సాగరతీరం జ్ఞాపకాలను మూటగట్టుకునే ప్రయత్నం చేశాను. కుటుంబ సమేతంగా సరదాగా గడిపేందుకు ఈ తీరం చక్కని వేదికగా ఉంటుంది.
దేశంలో భీమిలి బీచ్ అందాలే వేరు.