ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా 40కి చేరాయి. ఈ ఒక్క రోజే 17 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ 17 మందిలో చాలా మంది ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే. 17 మందిలో ఎనిమిది మంది ప్రకాశం జిల్లా, అనంతపురానికి చెందిన వారు ఇద్దరు, ఐదుగురు గుంటూరు, ఒకరు కృష్ణా జిల్లా వాసి కాగా మరొకరు తూర్పు గోదావరికి చెందిన వారు ఉన్నారు. ప్రకాశం జిల్లా కేసుల్లో ఐదుగురు చీరాలకు చెందిన వారే కావడం గమనార్హం. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం వరకు 164 మందిని పరీక్షించగా 147 మందికి నెగటివ్ వచ్చిందని, మిగతా వారికి పాజిటివ్ వచ్చిందని ఏపీ ప్రభుత్వం మెడికల్ బులిటెన్ విడుదల చేసింది.
కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది.జిల్లాల వారీగా మొత్తం 711 మంది వివరాలను ప్రకటించింది. వారంతా త్వరగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని ఆదేశాలిచ్చింది. విజయనగరం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం రూరల్‌లో ఒక్కరు, విశాఖపట్నం సిటీలో 41 మంది, తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో 16 మంది, రాజమండ్రిలో 21 మంది, కృష్ణా జిల్లాలో 16 మంది, విజయవాడ సిటీలో 27 మంది, గుంటూరు అర్బన్‌లో 45 మంది, గుంటూరు రూరల్‌లో 43 మంది. ప్రకాశం జిల్లాలో 67 మంది, నెల్లూరు జిల్లాలో 68 మంది, కర్నూల్ జిల్లాలో 189 మంది, కడప జిల్లాలో 59 మంది, అనంతపూర్ జిల్లాలో 73 మంది, చిత్తూరు జిల్లాలో 20 మంది, తిరుపతికి చెందిన 16 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చారు.అటు ఢిల్లీకి వెళ్లొచ్చి, పరీక్షలు చేయించుకోకుండా ఉండటంపై వీరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి వల్ల ఇంకెంత మందికి వైరస్ సోకిందోనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఒకవేళ వైరస్ మరింత మందికి సోకితే ఘోర ప్రమాదం ముంచుకొస్తున్నట్లేనని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో హై అలెర్ట్ ,,......ఒకే రోజు 17 "కరోనా" కేసులు.