న్యూఢిల్లీ : ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుతోంటే ! భారత్‌లో మాత్రం భగ్గుమని మండిపోతున్నాయి. విదేశాల్లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో ఏకంగా 18 సంవత్సరాల కనిష్టానికి పడిపోయాయి. కాగా భారతదేశంలో మాత్రం రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు దిగిరావడం లేదు.సోమవారం అమెరికా మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర 20 డాలర్లకు పడిపోయింది. ఇది 2002 నవంబర్ నాటి కనిష్ట స్థాయి. లాక్‌డౌన్ దెబ్బతో డిమాండ్ లేకపోవడంతో ధరలు క్షీణిస్తోన్నాయి. భారత్‌లో వరుసగా 14వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయడంలేదు. ఇంతక్రితం మార్చి 16న మోడీ సర్కార్ చమురు ధరలను సమీక్షించి పైగా రూ.3 ఎక్సైస్ డ్యూటీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ధరలు క్షీనిస్తున్నా భారత్‌లో మాత్రం యథాతథంగా కొనసాగించడం గమనార్హం.ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.59 లుగా, ముంబయిలో రూ.75.30లుగా ఉంది. దేశ రాజధానిలో లీటర్ డీజిల్ ధర రూ.62.29లు కాగా, ఆర్ధిక రాజధాని ముంబయిలో రూ.65.21లుగా విక్రయిస్తోన్నారు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.97, విజయవాడలో రూ.74.32లుగా ఉంది. ఇటీవల ఎక్సైస్ డ్యూటీ పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.39,000 కోట్లు రెవెన్యూ అంచనా వేసింది. అంటే ఈ మొత్తం ప్రజలపై భారం పడనుంది. అదే విధంగా భవిష్యత్తులో ఎక్సైస్ డ్యూటీ రూ.8 వరకు పెంచుకునేలా ఇటీవలే మోడీ సర్కార్ పార్లమెంట్‌లో ఆమోదం తెలిపింది.మార్చి 14 తర్వాత స్థూలంగా పెట్రోల్‌పై ఎక్సైస్ డ్యూటీ రూ.22.98లుగా, డీజిల్‌పై రూ.18.83లుగా అమల్లో ఉంది. మోడీ సర్కార్ 2014లో తొలత అధికారం చేపట్టిన సమయంలో పెట్రోల్‌పై రూ.9.48లుగా, డీజిల్‌పై రూ.3.56లుగా పన్ను అమల్లో ఉంది. బిజెపి ప్రభుత్వం 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య పెట్రోల్, డీజిల్‌పై తొమ్మిది సార్లు ఎక్సైస్ పన్నును ప్రజలపై బాదింది. మరోవైపు ఈ కాలంలో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. ఆ 15 మాసాల కాలంలో లీటర్ పెట్రోల్‌పై రూ.11.76, డీజిల్‌పై రూ.13.47 చొప్పున ఎక్సైస్ పన్నును పెంచింది. అదే సమయంలో దాదాపుగా పన్ను బాదుడును రెట్టింపున్నర చేసింది. 2014-15లో ప్రజలపై ఈ పన్ను భారం రూ.99,000 కోట్లుగా ఉండగా 2016-17 నాటికి ఏకంగా రూ.2,42,000 కోట్లకు చేర్చింది. 2017లో అక్టోబర్‌లో ఎక్సైస్ టేక్స్‌లో రూ.2 తగ్గించింది. మళ్లీ ఏడాదికే దీన్ని రూ.1.50 పెంచింది. 2019 జులైలో మరో రూ.2 పెంచేసింది. సౌది అరేబియా చమురు యుద్ధానికి తోడు కరోనా వైరస్ నేపథ్యంలో చమురు ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో అంతర్జాతీయంగా వీటి ధరలు అమాంతం క్షీణిస్తోన్నాయి. సాధా రణంగా ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 100 మిలియన్ బ్యారెళ్ల చమురు వినియోగం ఉంటుంది. గత కొన్ని వారాలుగా ఇందులో వినియోగం పావు వంతుకు పడిపోయింది. అంతర్జాతీయంగా భారీగా తగ్గుతున్న చమురు ధరలను భారత్‌లో మోడీ సర్కార్ వినియోగదారులకు చేర్చకుండా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలపై భారాన్ని మోపడం అన్యాయమని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక పన్నులు, ధరల వల్ల ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోయి. దేశ ఆర్ధిక వ్యవస్థకు మరిన్ని సవాళ్లు ఎదురు కానున్నాయని దేశ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.దీనిపై ప్రభుత్వం యోచన చేయమని కోరుతున్నారు.
18 ఏళ్ల కనిష్టానికి చమురు ధరలు ! భారత్ లో మాత్రం భగ్గుమంటున్నాయి.