దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 284కు పెరగడంతో ఈ వ్యాధిని నియంత్రించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని కఠినమైన చర్యలకు సిద్దమైంది. గృహ నిర్బంధ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఓ రిపోర్టు ప్రకారం ఉత్తర్వులు ఉల్లంఘిస్తే 6 నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని తెలిపింది. ఈ నిబంధనలను ధిక్కరించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉందని తెలిపింది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, "ప్రజలు గృహ నిర్బందాన్ని పాటించకపోతే కఠినమైన చట్ట నియమాలను పాటించేలా రాష్ట్ర్రాలకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి, సామాజిక దూరాన్ని పాటించడం చాలా ముఖ్యం అని అధికారి తెలిపారు.ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే అంటువ్యాధుల వ్యాధుల చట్టంలోని సెక్షన్ 10, విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 10ప్రకారం 6 నెలల జైలు శిక్ష లేదా 1000 రూపాయల జరిమానా లేదా రెండూ విధించే హక్కు రాష్ట్రాలకు ఉంది. కరోనా వైరస్ సోకిన దేశాలను నుంచి స్వదేశానికి వచ్చిన తర్వాత క్వారంటైన్ వార్డుల నుంచి పారిపోవడంతోపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్ళని కేసుల నేపథ్యంలో ఈ నిబంధనలు మళ్లీ తెరపైకి వచ్చాయి.కరోనా వైరస్ పై పోరాటానికి ప్రతి ఒఖ్కరు సామాజిక దూరం పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లూవ్ అగర్వాల్ శుక్రవారం మీడియాతో అన్నారు. ఏదైనా సందేహం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1075 కాల్ చేయాలని కోరారు.
నిబంధనలు అతిక్రమిస్తే జైలుకే.