జనతా కర్ఫ్యూ పాటిద్ధాం "కరోనా"ని పారదోలుదాం : మంత్రి ధర్మాన

శ్రీకాకుళం : కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆదివారం జరగనున్న జనతా కర్ఫ్యూనకు  జిల్లా ప్రజలంతా సంఘీభావం ప్రకటించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ పెను విపత్తు నుంచి కాపాడుకోవడానికి ఆదివారం అంతా సమైక్యతతో ఇంట్లో సురక్షితంగా ఉందామని విజ్ఞప్తి చేశారు. మబగాం  క్యాంపు కార్యాలయం నుంచి శనివారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని జిల్లా అధికారులను అలాగే సహకరిస్తున్న ప్రజలను అభినందించారు. దాదాపు 262 మంది ఇప్పటికే స్వీయ గృహనిర్బంధంలో ఉన్నారని, అలాగే 98 శాతం ఇంటింటి సర్వే పూర్తయిందని అన్నారు. తాను జిల్లా కలెక్టర్ తో కలసి ఎప్పటికప్పుడు జిల్లా పరిస్థితిని అంచనా వేస్తున్నామని, కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ముందస్తు చర్యలకు ఇప్పటికే  ఏర్పాట్లు చేసామని చెప్పారు.  జనతా కర్ఫ్యూ లో భాగంగా జనసంద్రంగా ఉండే అన్ని ప్రాంతాలనూ మూసి వేస్తున్నామని, ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. జిల్లాలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు కూడా ఎవరూ వెళ్లకుండా ఉండాలని మంత్రి కోరారు. వ్యక్తిగత పరిశుభ్రతకు అందరూ ప్రాధాన్యం ఇవ్వాలని,  సామాజిక దూరం పాటించి క్రమశిక్షణతో మెలగాలని కోరారు. కరోనా కట్టడి కోసం  కలసికట్టుగా పోరాడుదామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని, అలాగే    ప్రధాని మోదీ సూచించినట్లుగా ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రజలంతా ఇళ్ల బాల్కనీలు, ద్వారాల వద్దకు వచ్చి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు విశేషంగా సేవలందిస్తున్న సిబ్బందికి మద్దతుగా ఐదు నిమిషాల సేపు నిలబడి చప్పట్లు, గంటలు మోగిస్తూ సంఘీభావం తెలియ చేసి వారి సేవలకు ప్రోత్సాహంగా అందరూ మద్దతు తెలియ జేయాలని కృష్ణదాస్ జిల్లా ప్రజలను కోరారు.