వాషింగ్టన్ : అంతర్జాలంలో కనిపించిన ప్రతి దానినీ నమ్మకూడదని చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ. పెద్ద పెద్ద నేతలు మీడియా సమావేశాల్లో మందుల గురించి, వ్యాధుల చికిత్స గురించి చెప్పే మాటలను గుడ్డిగా ఆచరించకూడదని ఈ భార్యాభర్తల గురించి తెలుసుకుంటే చెప్పక తప్పదు.ఫీనిక్స్‌లోని బేనర్ హెల్త్ ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం అరిజోనాలోని మేరీకోపా కౌంటీకి చెందిన 60 ఏళ్ళ వయసు పైబడిన దంపతులు ఇటీవల కరోనా వైరస్ గురించి విన్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మహమ్మారిని నిరోధించడంలో క్లోరోక్విన్ గొప్పగా ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పడం గమనించారు. మరోవైపు ఇంటర్నెట్‌లో కూడా క్లోరోక్విన్ గురించి చదివారు.ఈ నేపథ్యంలో ఈ దంపతులిద్దరికీ కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ కాకపోయినప్పటికీ, ఆదివారం సొంత వైద్యం చేసుకున్నారు. యాంటీ మలేరియా డ్రగ్‌లో ఉపయోగించే మందును భార్యాభర్తలిద్దరూ తీసుకున్నారు. వెంటనే ఇద్దరికీ వాంతులు, తల తిప్పడం వంటి దుష్ఫలితాలు కనిపించాయి. భర్త గుండె పోటుతో మరణించారు. భార్య పరిస్థితి ఇప్పుడిప్పుడే నిలకడ స్థితికి చేరుకుంటోంది. ఆమె కోలుకునే అవకాశాలు ఉన్నాయి.బేనర్ పాయిజన్ అండ్ డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ డేనియల్ బ్రూక్స్ మాట్లాడుతూ ఈ దంపతులు సొంత వైద్యం చేసుకున్నారని, ఇది అందరికీ ఓ హెచ్చరిక అని తెలిపారు. ఈ విధంగా సొంత వైద్యం చేసుకోవడం చాలా ప్రమాదకరమని, మూర్ఖత్వమని తెలిపారు. ఇదేమీ గారడీ చేసే మాత్ర కాదని చెప్పారు.ఈ దంపతులు ఇంటర్నెట్‌లో క్లోరోక్విన్ ఫాస్పేట్ గురించి చదివారని, కోవిడ్-19కు చికిత్సకు సంబంధించి ఇంటర్నెట్‌లో తప్పుడు సమాచారం చాలా ఉందని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్పే మాటలను, ఇచ్చే సలహాలను మాత్రమే పాటించాలని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆరోగ్య శాఖ అధికారులు అందజేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలన్నారు. ప్రజలు ఆందోళనకు గురవుతూ, పరీక్షలు చేయించుకోకుండానే ఏవో లక్షణాలు కనిపించినంత మాత్రానికి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇది తగదని స్పష్టం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవరం వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. చాలా కాలం నుంచి మలేరియా నివారణకు వాడుతున్న రెండు మందులు - క్లోరోక్విన్, హైడ్రోక్సిక్లోరోక్విన్ - కరోనా వైరస్‌కు సమగ్ర చికిత్స కాగలవని అన్నారు. ఈ మందులను పరీక్షిస్తున్నారన్నారు.ఇదే మీడియా సమావేశంలో ట్రంప్‌తోపాటు ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ ఎస్ ఫౌకీ మాట్లాడుతూ ఈ మందులు కరోనా వైరస్ చికిత్సకు ఉపయోగపడతాయనేది పిట్టకథ అని, అమెరికాలో దీనికి అధికారిక ఆమోదం లేదని చెప్పారు.
*కరోనా* విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న ఒక కుటుంబం ఏమయ్యిందో చూడండి. ఇది మనకు ఒక గుణపాఠం కావాలి.