చైనాలో క్రొత్త వైరస్ : ఒకరు మరణం

చైనా : కోవిడ్ వైరస్‌తో ఇప్పటికే చైనాలో 3వేల మందికి పైగా మరణించారు. మరో 80వేలకు పైన మంది ఈ మహమ్మారితో పోరాటం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆ దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కరోనా మొదటి బయట పడిన వూహాన్ గత వారం రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆ దేశ ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ లోపే మరో కొత్త వైరస్ డ్రాగన్ కంట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చైనాలోని యువన్ ఫ్రావిన్సులో హంటా వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. షాండాంగ్ ఫ్రావిన్సులకు వెళ్తున్న అతడు హంటా వైరస్‌తో మృతి చెందినట్లు ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. దీంతో ఆయన ప్రయాణించిన బస్సులో 32 మందిని టెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.కాగా ఈ వైరస్ వ్యాప్తికి ఎలుకలే ప్రధాన కారణమని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఇంటిలో చుట్టుపక్కల పరిసరాల్లో ఎలుకల వలన హంటావైరస్ వ్యాప్తించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఎలుకల లాలజలం, మూత్రం లేదా దాని వ్యర్థాలను తాకిన తర్వాత ఎవరైనా తమ కళ్లు, ముక్కు, నోటిని తాకితే అది సంక్రమిస్తుందని తెలిపింది. హెచ్‌పీఎస్, హంటా వైరస్ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయని ఆ సంస్థ వెల్లడించింది. హంటా వైరస్ సోకిన వారిలో హెచ్‌పీఎస్ రోగుల మాదిరిగానే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కడుపు నొప్పి, వికారం, వాంతులు, మైకం, విరేచనాలు, ఉదర సంబంధ లక్షణాలు ఉంటాయని పేర్కొంది. దీని తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ ఊపిరితిత్తులు కఫంతో నిండిపోయి, శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది అని తెలిపారు. కాగా హంటావైరస్‌ను ఆండీస్ వైరస్ అని కూడా అంటారు. అయితే హంటా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ అని వారు వెల్లడించారు.