మంగళూరు-సంత్రాగచ్చి రైల్లో సోమవారం ఉదయం బ్రహ్మపుర చేరుకున్న కార్మికులు

బ్రహ్మపురం : దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 'కొవిడ్‌-19' వ్యాపిస్తుండడంతో ఆయాచోట్ల నివసిస్తున్న గంజాం జిల్లావాసులు కుటుంబాలతో వేలాదిగా సొంతూళ్లకు తిరిగివచ్చారు. దీంతో జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముంబయి, పూణే తదితర ప్రాంతాల నుంచి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు జిల్లాకు తరలివస్తున్నట్లు యంత్రాంగానికి సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.ఆదివారం అర్ధరాత్రి బ్రహ్మపుర రైల్వేస్టేషన్‌లో ముమ్మర ఏర్పాట్లు చేశారు. స్టేషన్‌లోని అన్ని మార్గాలను మూసివేయించి, ఒకటో నెంబరు ప్లాట్‌ఫారంపై రెండు ప్రవేశ మార్గాల ద్వారా ప్రయాణిలను బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. జిల్లా ఆరోగ్యశాఖ వైద్యులు, ఇతర సిబ్బందితో తొమ్మిది ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. రైళ్లలో జిల్లాకు వచ్చిన ప్రయాణికులు ఎక్కడి నుంచి వచ్చారు? వారు ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారా? తదితర వివరాలు సేకరించి, వారు 14 రోజులపాటు ఇంట్లోనే ఏకాంతంగా గడపాలని సూచిస్తూ పత్రాలు రాసి ఇచ్చారు. అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ ఏడు రైళ్లలో మూడు వేల మందికిపైగా ప్రయాణికులు జిల్లాకు వచ్చారని అధికారులు తెలిపారు. వీరిలో అయిదుగురు దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు గుర్తించి, వారిని హుటాహుటిన ఎమ్కేసీజీ వైద్య కళాశాల ఆసుపత్రిలోని 'కొవిడ్‌-19' ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డుకు తరలించామని చెప్పారు. అక్కడి వైద్యులు వారిని పరీక్షించిన అనంతరం వారిని ఇళ్లకు పంపించి, ఇంట్లో ఏకాంతంగా ఉండాలని సూచించారని జాతీయ ఆరోగ్య మిషన్‌ జిల్లా కార్యక్రమ అధికారి శ్యాంసుందర్‌ త్రిపాఠి తెలిపారు.పరిస్థితి సమీక్షించిన గంజాం కలెక్టరు
రైల్వే స్టేషన్‌లో పరిస్థితిపై గంజాం కలెక్టరు విజయ అమృత కుళంగె సమీక్షించారు. ఆయన ఆదివారం రాత్రి నుంచి సోమవారం వేకువ వరకూ స్టేషన్‌లోనే ఉండి ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు, వారిని సొంతూళ్లకు తరలించేందుకు ఏర్పాట్లను సమీక్షించారు. బ్రహ్మపుర ఎస్పీ పినాక్‌ మిశ్ర, బ్రహ్మపుర సబ్‌కలెక్టరు సింధే దత్తాత్రేయ భావుసాహెబ్‌, యువ ఐఏఎస్‌ అధికారి వి.కీర్తివాసన్‌ ఇతర అధికారులు స్టేషన్‌లో ఏర్పాట్లు పర్యవేక్షించారు. రోటరీ క్లబ్‌ ప్రతినిధులు పాల్గొని ప్రయాణికులకు థర్మల్‌ పరికరాలతో పరీక్షలు నిర్వహించారు. వివిధ రైళ్లలో బ్రహ్మపుర చేరుకున్న వారిని తరలించేందుకు 35 బస్సులను ఏర్పాటు చేశామని గంజాం జిల్లా ప్రాంతీయ రవాణా అధికారి సంజయ కుమార్‌ బిశ్వాళ్‌ తెలిపారు.ప్రయాణికులపై గట్టి నిఘా ఉంచి రైళ్లలో బ్రహ్మపుర చేరుకున్న వారి వివరాలు, చిరునామా, ఫోను నెంబరు తదితరాలు సేకరించామని, వారి కదలికలపై గట్టి నిఘా పెడతామని అధికారులు తెలిపారు. గంజాం జిల్లాలోని భంజనగర్‌, సురడా, శెరగడ, బడగడ, పొలసరా, కొదలా, కళ్లికోట, ఛత్రపురం, హింజిలి తదితర ప్రాంతాలతోపాటు కొంధమాల్‌, గజపతి, రాయగడ జిల్లాలకు చెందిన వారు కూడా వివిధ రైళ్లలో బ్రహ్మపుర చేరుకున్నారని చెప్పారు. ఇతర జిల్లాల అధికారులకు వారి వివరాలు తెలియజేశామని, గంజాం జిల్లాలో ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేలోగానే అక్కడి ఆరోగ్యశాఖ సిబ్బంది సిద్ధంగా ఉంటారని వివరించారు. సొంతూళ్లకు చేరుకున్న ప్రయాణికులు 14 రోజులపాటు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటారని వారు వివరించారు.