ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల పోరుపై "కరోణా" ప్రభావం

అమరావతి : కరోనావైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఈ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించారు.రాష్ట్రంలో పంచాయితీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉండగా ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడుతుండటం వల్ల ఓటు వేయడానికి ఎక్కువ సమయం పడుతుందని, పైగా బ్యాలెట్ పేపర్ ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని, కాబట్టి విధిలేని పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ప్రజల క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆరు వారాలపాటు ఎన్నికలను నిలిపివేస్తున్నామని, ఇది ఎన్నికల నిలిపివేత మాత్రమే తప్ప రద్దు కాదని చెప్పారు.ఆరు వారాల తర్వాత మరొకసారి సమీక్ష జరిపి ఈ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. పంచాయితీ ఎన్నికలకు షెడ్యూల్ కూడా ఆరు వారాల తర్వాతే ప్రకటిస్తామన్నారు.కాగా, ఈ ఆరు వారాల పాటూ ఎన్నికల నియమావళి అమలవుతుందని ఆయన స్పష్టం చేశారు.