కరోనా విపత్కర పరిస్థితిలో వీరి ఆరోగ్యం అధికారులకు పట్టదా?

శ్రీకాకుళం : "కరోనా" ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్. ఈ వైరస్ చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు విస్తరించి నేడు ప్రపంచ ఆర్థిక మూలాలను సైతం అతలా కుతలం చేయడం నేడు చూస్తున్నాం. అది మనదేశంలో పడి మెల్ల మెల్లగా విస్తరించింది. ఈ కరోనా పాజిటివ్ కేసులు మన రాష్ట్రంలో కూడా ప్రారంభంలో తక్కువగా నమోదు అయినా అవి నిన్నటికి 300కు దాటాయి. ఈ నేపధ్యంలో ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు గానూ మన దేశం "లాక్ డౌన్" ప్రకటించింది. అయినా ప్రజలకు అవగాహన కల్పించి స్వీయ నియంత్రణ చేయడంలో విఫలం అయిందనే వాదన ప్రజలను సైతం పీడిస్తుంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో రాత్రి పగలు అనక నేటి సమాజంలో నిత్యం సేవ చేస్తూ ఆరోగ్య,పోలీసు,పారిశుద్య కార్మికులు అలుపెరగక పనిచేస్తూ ప్రభుత్వం దగ్గర గానీ ప్రజల దగ్గర గానీ గుర్తింపు పొందడం చూస్తున్నాము.వీరు చేస్తున్న సేవలు అమోఘమని చెప్పవచ్చు. వీరిలాగే ఎవరు గుర్తించక పోయినా తమ విధి నిర్వహణలో అలుపెరుగక మారుమూల ప్రాంతంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది మన మీడియానే. అయితే మనల్ని కూడా ఎంతో కొంత గుర్తించినా, నేటికీ ప్రజలు గానీ ప్రభుత్వాలు గానీ గుర్తించని అతి పెద్ద వ్యవస్థ ఒకటుంది. అదే "ఇండియన్ రైల్వే" . లాక్ డౌన్ సమయంలో మైళ్ ఎక్స్ ప్రెస్ లు రద్దయినా, నిత్యం మనకు కావలసిన నిత్యవసరాలు ఒక చోట నుండి మరొక చోటుకు చేరుస్తూ ప్రభుత్వానికి కొంత ఆధాయ వనరులను సూపిస్తున్న గూడ్స్ రైలు మాత్రం ప్రజలకు సేవ చేయడంలో అమోఘమనే చెప్పవచ్చు. ఈ వ్యవస్థ నడవాలన్నా ఫైలట్ అలాగే అసిస్టెంట్ ఫైలట్, గార్డు, స్టేషన్ మాష్టారు, గేటుమేన్ కీ మేన్, చివరకు రైల్వే లైన్ తనిఖీ చేసే గాంగ్ మాన్ వరకూ అంతా పనిచేస్తేనే ఈ గూడ్స్ రైలు కూడా లైనెక్కుతుంది.అటువంటి వ్యవస్థ మొత్తం నేటికీ అలుపెరుగక సేవలను చేయడంవల్ల మనం అంతో ఇంతో స్వేచ్ఛగా ఇల్లకే పరిమితమైనా వస్తువులు అందుతున్నాయి. వారి సేవలు ఈ ప్రభుత్వానికి గానీ ప్రజలకు గానీ ఎప్పుడైనా గుర్తు రాక పోవడం చాలా బాధాకరం. అయితే ఇక్కడే మరో విచిత్రమైన విషయం మనం గ్రహించాలి. ఈ సేవలు అందించే సిబ్బందికి రక్షణా ప్రమాణాలు పాటించడంలో మాత్రం సదరు రైల్వే శాఖ అశ్రద్ధ వహిస్తుందనే చెప్పవచ్చును. ఈ గూడ్సులను ఒక చోట నుండి వేరొక చోటుకు చేర్చే సమయంలో లోకో ఫైలట్, అసిస్టెంట్ లోకో ఫైలట్, గార్డులు కీలకమైన పాత్ర పోషిస్తారు. వారు కొన్ని కిలోమీటర్లకు ఒక్కొక్క వ్యక్తులు మారుతూ ఈ గూడ్స్ రైలు పరుగులు తీస్తుంది. అలాంటప్పుడు ముందు నడిపే వ్యక్తుల నుండి మరొకరికి ఈ ఇంజను లేదా గార్డ్ బాక్స్ మారే సమయంలో అవి పూర్తిగా పరిశీలించి శానిటేషన్ చేసి వేరొక వ్యక్తులకు అప్పగించనప్పుడు దురదృష్టవశాత్తు ముందు ఉన్న వారికి ఈ వైరస్ సోకిన అది చైనులా వారినుండి మరొకరికి అలాగే వారినుండి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెంది చివరకు వ్యవస్థను నాశనం చేయక మానదు. ఇది ఇలా ఉంటే లైనులు అన్నీ ట్రాఫిక్ లేకుండా క్లియర్ గా ఉన్న ఈ నేపధ్యంలో మానవునికి అత్యవసర సరుకులు చేరుస్తూ , ఇదే సమయంలో అవసరం కాని వస్తువులు కూడా ఈ ట్రాకులపై ఈ మధ్య పరుగులు తీయడం మనం చూస్తున్నాం. అవేమిటి అని మనం చూస్తే కార్లు, ఇనుప ముడిసరుకు, ఇలాంటివి ఇంకా ఎన్నో రవాణా జరుగుతూ మనకు దర్శనం ఇస్తున్నాయి. ఇదేమిటి అని కొందరిని ఆ శాఖలో పనిచేసే వ్యక్తులను కళింగ రాజ్యం ఆరా దీయగా ఇదే అదునుగా కార్మికులకు పని భారం పెంచి పై అధికారుల వద్ద మార్కులు సంపాదించి ప్రమోషన్లు కొట్టడం కోసం ఆఫీసులో కూర్చుని రైల్వే కార్మికులకు పని భారం పెంచడం జరుగుతున్న విషయం బహిరంగ సత్యం. అదే విషయం కార్మికుల వద్ద ప్రస్తావించగా అది నిజమే పని భారం ఎలా ఉన్నా వారి ఆరోగ్య భద్రత పూర్తిగా గాలికి విడిచి పెట్టినట్లు వాపోయారు. దేశంలో అతి పెద్ద వ్యవస్థ అయిన ఈ వ్యవస్థలో పనిచేసే వారు కూడా మానవులే అని వారి రక్షణ మన సమాజం పైనా ప్రభుత్వం పైనా అలాగే ముఖ్యంగా రైల్వే అధికారులపై ఉందని గుర్తించాలి. "కనిపించని సమాజ సేవకులారా మీ సేవలు అమోఘమని" నమ్మి మీ ఆరోగ్యం మాకందరికీ ముఖ్యమైనది అని నమ్మి తగు రక్షణ కల్పించి మీ సేవలను గుర్తించి తగు ప్రోత్సాహం ప్రభుత్వం కల్పించాలని "కళింగ రాజ్యం "కోరుతుంది.