కరోనా కల్లోలంలో కొట్టుకుపోయిన కార్మికుడు .

కరోనా మహమ్మారి సామాన్యుల బ్రతుకుల్లో కల్లోలం రేపుతోంది. దాన్ని తరిమికొట్టాలని దేశవ్యాప్త లాక్ డౌన్ విధించగా ఫలితాలు కొన్నిచోట్ల హృదయవిదారకంగా ఉంటున్నాయి.ముఖ్యంగా పొట్ట చేతపట్టుకుని వివిధ రాష్ట్రలకు వలస వెళ్లిన వలస కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైంది. అటు తమ ఊళ్లకు వెళ్లలేక, ఉన్నచోట పస్తులు ఉండలేక మరోవైపు కరోనా భయంతో వారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. సొంత గ్రామాలకు తిరిగి వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో నడుచుకుంటూ రోడ్డుబాట పడుతున్నారు. వందల కిలోమీటర్లు నడిచి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది వలస కూలీలు అన్యాయంగా చచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి.తాజాగా తమిళనాడుకు చెందిన ఓ యువకుడు మహారాష్ట్రలోని నాగపూర్‌ నుంచి కాలిబాటన బయలుదేరి హైదరాబాద్‌లో కన్నుమూశాడు. తమిళనాడుకు చెందిన లోగేష్‌ బాల సుబ్రహ్మణ్యం ఉపాధి నిమిత్తం నాగపూర్‌కు వలస వెళ్లాడు. కరోనాతో దేశంలో లాక్‌డౌన్ విధించడంతో అతను ఇంటికి వెళ్లిపోవాలని భావించాడు. పనిలేక, తిండిలేక పస్తులు ఉండటం ఎందుకని? వెళ్లి పెళ్లాం పిల్లలతో కలో గంజో తాగుదామని కాలి నడకన తన స్వగ్రామం తమిళనాడులోని నమక్కళ్‌కు బయలుదేరాడు. మూడు రోజుల పాటు సుమారు 500 కిలోమీటర్లు నడిచాడు. సికింద్రాబాద్‌ చేరుకునే సమయంలో తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. అతన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమచారం ఇవ్వడంతో ఓ షెల్టర్‌ హోంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గరువారం రాత్రి లోగేష్ మృతిచెందాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని వైద్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.వేసవి కాలంలో ఎక్కువ దూరం నడవడం మూలంగా డీహైడ్రేషన్‌తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని స్వస్థలానికి పంపించే ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.