కరోనా వైరస్ పుట్టుకపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను తయారు చేశారని అమెరికా సహా పలు ప్రపంచ దేశాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, జంతువుల ద్వారానే ఆ వైరస్ పుట్టిందని తెలిపింది. ఇప్పటి వరకు చేసిన అన్ని అధ్యయనాల్లో వైరస్ జంతువుల నుంచే వచ్చినట్లు తేలిందని, ల్యాబ్‌లో తయారు చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి ఫడేలా చియాబ్ తెలిపారు. అయితే, జంతువుల నుంచి మనుషులకు ఆ వైరస్ ఎలా వ్యాప్తి చెందిందన్న విషయం తెలీదని చెప్పారు. గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందిందన్న వాదనకు పూర్తి ఆధారాలు కూడా తెలియాల్సి ఉందని వెల్లడించారు.అటు చైనాలోని వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా ల్యాబ్‌లోనే వైరస్‌ను తయారు చేశారన్న వార్తలను ఖండించింది.కాగా, డబ్ల్యూహెచ్‌వోకు నిధులను ఆపేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపైనా ఆమె స్పందించారు. పరిస్థితిని తాము సమీక్షిస్తున్నామని, సభ్య దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.కోవిడ్ మాత్రమే కాకుండా పలు రోగాలపైనా పోరాటం చేయాల్సి ఉందన్నారు. పోలియో, హెచ్‌ఐవీ, మలేరియా తదితర రోగాలపై పోరాటానికి నిధులు అవసరం అవుతాయని ఆమె అన్నారు.
కరోనా పుట్టుకపై WHO సంచలన ప్రకటన .