కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నవేగం, కొవిడ్-19 కొత్త కేసులు వెలుగుచూస్తున్న తీరునుబట్టి దేశవ్యాప్తంగా సోమవారంలోగా కేసుల సంఖ్య 30వేలు, మరణాలు 1000 దాటే అవకాశముంది. మన దగ్గర వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరనే లేదని కేంద్రం పదే పదే చెబుతున్న నేపథ్యంలో మే3వ తేదీ తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. అంతలోనే, కరోనా ఉధృతిపై తప్పుడు అంచనాలు వేయబోమని, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు లాక్ డౌన్ పొడగింపు చర్చకు బలం చేకూర్చేలా ఉన్నాయి.ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ లో కరోనాపై పోరు సంఘటితంగా సాగుతున్నదని, మహమ్మారిపై యుద్ధంలో ప్రజలే సైనికుల్లా ముందుండి నడిపిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.ఆదివారం నాటి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రసంగం చివర్లో ఆయన సీరియస్ హెచ్చరికలు చేశారు. పాపులర్ సామెతలను ఉటంకిస్తూ, రాబోయే కాలంలో ప్రజలు మరింత జాగరూకులై ఉండాలన్నారు. పోలియో నివారణ మంత్రం 'నిండు జీవితానికి రెండు చుక్కలు' తరహాలో కరోనాపై 'రెండు గజాల దూరం జీవితానికి అత్యవసరం' అనే కొత్త నినాదమిచ్చారు.కరోనా మహమ్మారి పట్ల అతివిశ్వాసం పనికిరాదు. మా ఊరిలో కరోనా లేదనో, ఇప్పటిదాకా మా గల్లీలో లేదంటే మా ఇంట్లో ఎవరికీ వైరస్ సోకలేదు కదా, ఇకపైనా దాని ప్రభావం ఉందేమోనని అనుకోవడం చాలా తప్పు. ఇలాంటి సమయంలో నిర్లక్ష్యమే మన పాలిట శాపంగా మారుతుంది. సావధానంగా లేకపోతే దుర్గటన తీవ్రత అత్యంత పెరిగిపోతుంది. ఇలాంటి విషయాలకు సంబంధించి మన పూర్వీకులు ముందే హెచ్చరించారు. నివురుగప్పిన నిప్పు, మర్చిపోయిన అప్పు, దాచుకన్న రోగం ఈ మూడింటినీ తేలికగా తీసుకోరాదని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అవి తిరగబెట్టి కొంపలు ముంచుతాయని పెద్దలు అంటుంటారు. కరోనా వైరస్ విషయంలోనూ ఆ సూత్రాన్ని మనం కచ్చితంగా గుర్తుంచుకోవాలి''అని ప్రధాని అన్నారు.కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడగించింది. తెలంగాణలో మాత్రం నాలుగు రోజులు అదనంగా, అంటే మే 7 వరకు లాక్ డౌన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన బాటలో ఇప్పుడు ఢిల్లీ కూడా పొడగింపునకు మొగ్గుచూపుతోంది. దీనికి సంబంధించి సీఎం కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో ఓ కమిటీ వేశారు. ''వైరస్ వ్యాప్తి, కేసుల తీవ్రత దృష్ట్యా ఢిల్లీలో మే మూడో వారం లేదా చివరిదాకా లాక్ డౌన్ అమలు చేయాల్సిందే''అని కమిటీ తేల్చిందని, ఆ రిపోర్టుకు సీఎం కూడా నేడో రేపో ఆమోదం తెలుపుతారని, తద్వరా లాక్ డౌన్ పొడగింపు ఖాయమైనట్లవుతుందని ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.
ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య దాదాపు 27వేలకు పెరిగాయి. ప్రధానంగా తొమ్మిది రాష్ట్రాల్లో కేసులు, మరణాల తీవ్రత ఎక్కువగా ఉంది. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రమైన మహారాష్ట్రలో కేసుల సంఖ్య 8వేలకు, మరణాలు 350కి చేరువయ్యాయి. గుజరాత్ లో 3వేల పైచిలుకు కేసుల, 133 మరణాలు నమోదయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలో 2625మందికి వైరస్ సోకగా, 54 మంది చనిపోయారు. రాజస్తాన్ లో 2,141, మధ్యప్రదేశ్, తమిళనాడులో దాదాపు 2 వేలు, ఉత్తరప్రదేశ్ లో 1800 కేసులుండగా ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నిలిచాయి. ఏపీలో 81 కొత్త కేసులతో ట్యాలీ 1097కు పెరగ్గా, తెలంగాణలో శనివారం రాత్రినాటికి 990 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఢిల్లీతోపాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ పొడగింపుపై స్పష్టత ఇచ్చే అవకాశముంది. గతంలో మాదిరిగా ముందుగా రాష్ట్రాలు ప్రకటించిన తర్వాతే కేంద్రం క్లారిటీ ఇస్తుందని తెలుస్తోంది.
మే మూడవ వారం వరకూ తప్పదు .