అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు, అమర కళావేత్త కామ్రేడ్ రామారావు విప్లవ సాంస్కృతికోద్యమ సేనానిగా ఉద్యమ చరిత్రలో శాస్వత చిరునామాగా వుంటారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకులు సన్నశెట్టి రాజశేఖర్ అన్నారు. ఉద్యమాల్లో నిత్య చలన శీవతను రామారావు పాట రగిలిస్తూనే వుంటుందని చెప్పారు. అరుణోదయ రామారావు ప్రథమ వర్థంతి కార్యక్రమాన్ని అరుణోదయ శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళంలో జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ నాలుగున్నర దశాబ్దాల విప్లవోద్యమ బంధాన్ని రామరావుతో తనకు పెనవేసుకుందని వివరించారు.అరుణోదయ జిల్లా అధ్యక్షులు మార్పు మల్లేశ్వరరావు అధ్యక్షతన ఈరోజు ఉదయం సాగిన ఈ నివాళి కార్యక్రమంలో సిపీఐ (యం.యల్) జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ మాట్లాడుతూ నూతన ప్రజాతంత్ర విప్లవమే ఈ దేశ విముక్తికి మార్గమని నమ్మిన పోరాట యోధుడు అని కలం గళం ఆయుధాలుగా చేసి సాంస్కృతిక కదన రంగాన కదలబారిన ప్రజా సాంస్కృతిక సైనికుడు కామ్రేడ్ అరుణోదయ రామారావు అంటూ ఆయన సాగించిన కృషిని వివరిస్తూ అరుణారుణ జోహార్లను అర్పించారు. తొలుత రామారావు చిత్రపటానికి పూలమాలతో మార్పు మల్లేశ్వరరావు నివాళులు అందజేశారు. రామారావు ప్రథమ వర్థంతి సందర్భంగా నిర్వహించిన ఈ సంస్మరణలో కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు మిస్క కృష్ణయ్య, నాస్తికోద్యమ నాయకులు, రచయిత బొంత జగన్నాథరావు, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మార్పు సత్యవతి, కృష్ణవేణి, ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి క్రాంతి, నేతింటి నీలంరాజు, తదితరులు రామారావు దారిలో పయనించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని సమాజానికి పిలుపు నిచ్చారు.
సాంస్కృతికోద్యమ సేనాని రామారావు : సన్నశెట్టి రాజశేఖర్