స్పందనకు అశేష స్పందన

శ్రీకాకుళం : డిసెంబర్ 2 : ఈ రోజు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని స్పందన భవనంలో స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టరు మరియు ముఖ్య శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా  జిల్లా నలుమూలల నుండి  పెద్దఎత్తున ఆర్జీదారులు పాల్గొనడం విశేషం. సంతకవిటి మండలం అప్పల అగ్రహారానికి చెందిన బి.అప్పలనాయుడు ఆర్జీని జిల్లా కలెక్టర్ కు   సమర్పిస్తూ తాము తయారు చేసిన వర్మికంపోస్టు, ఎరువులను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రణస్థలం మండలం పైడిభీమవరం నుండి జె.అప్పన్న ఆర్జీని ఇస్తూ దేవుని పాలవలస గ్రామంలో ఉన్న 89 సెంట్ల డి-పట్టా భూమిని సర్వేచేసి హద్దులను నిర్ణయించి పేదలకు పంపిణీ చేయాలని కోరారు. 2017 సంవత్సరంలో మీ సేవలో తాను చలాను కట్టినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని ఫిర్యాదు చేసారు. పొందూరు నుండి కనకాల గోవింద ఆర్జీని ఇస్తూ ఆగ్రిగోల్ట్ నందు రూ.10వేలు జమచేసామని, అయితే దానికి సంబంధించిన నగదు తన బ్యాంకు ఖాతాలో జమకాలేదని ఫిర్యాదు చేసారు. కోటబొమ్మాళి నుండి బీరు రాజులమ్మఆర్జీని సమర్పిస్తూ 1.60 ఎకరాల జిరాయితీ భూమి తనకు ఉన్నందున రైతుభరోసా పథకం అమలుచేయాలని కోరారు. శ్రీకాకుళం నగరపరిధిలో గల జుత్తుక హైమావతి తనకు రేషన్ కార్డును మంజూరుచేయాలని ఆర్జీని సమర్పించారు. శ్రీకాకుళం కొత్తపేట బర్మాకాలనీ నివాసి బి.రాజు ఆర్జీ ఇస్తూ కిల్లిపాలెం ఇసుక ర్యాంపులు వలన వాహనాలు ఎక్కువగా తిరుగుచున్నాయని, తద్వారా దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. అదేవిధంగా ఇంటినుండి చిన్నపిల్లలు బయటకు తిరగేందుకు భయపడుతున్నారని, కావున ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటుచేయాలని ఫిర్యాదు చేసారు. సీతంపేట మండలం కొత్తకోట నుండి బిడ్డిక ప్రవీణ ఆర్జీని ఇస్తూ వెటర్నరీ అసిస్టెంటుగా తాను ఎంపిక అయ్యాయని, కావున తనకు సీతంపేటలో పోస్టింగు ఇప్పించాలని కోరారు. టెక్కలి మండలం సీతాపురం నుండి బి.ఝాన్సీ ఆర్జీని ఇస్తూ తాను ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నామని, అయితే తనకు చెందిన ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇంతవరకు తన బ్యాంకు ఖాతాలో జమకాలేదని ఫిర్యాదు చేసారు. గంపం చిన్నారావు, కొనపం భాగ్యవతి తాము చేనేత కార్మికులమని, తమకు స్వంత మగ్గాలు ఉన్నాయని, కావున తమకు వై.యస్.ఆర్. నేతన్న చేయూత పథకాన్ని అమలుచేయాలని కోరారు. గార మండలం సుంకలపాలెంనుండి పేడాడ బుచ్చెమ్మ ఆర్జీ ఇస్తూ తనకు 0.50 ఎకరాల భూమి ఉన్నందున రైతు భరోసా పథకాన్ని అమలుచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, సంయుక్త కలెక్టర్ 2 ఆర్.గున్నయ్య, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎ.కళ్యాణ్ చక్రవర్తి, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు డా.వి.వి.కృష్ణమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.వి.ఆదిత్యలక్ష్మీ, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి చక్రధరరావు, బి.సి.సంక్షేమ అధికారి కె.కృతిక, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు,  గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ టి శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.యం.చెంచయ్య.  జిల్లా విద్యా శాఖాధికారి యం.చంద్రకళ, ఆర్.టి.సి పి.ఆర్.ఓ బి.ఎల్.పి.రావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.